కలం, నేషనల్ డెస్క్ : వలస విధానాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును మరింత పెంచారు. చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వెనక్కి తగ్గట్లేదు. హెచ్-1బీ వీసాల (H-1B Visa) ద్వారా కొత్త విదేశీ నిపుణులను తీసుకొచ్చే కంపెనీలపై విధించిన లక్ష డాలర్ల రుసుమును మరో 12 నెలల పాటు పొడిగించారు. అలాగే అమెరికన్ ఉద్యోగులను లేఆఫ్స్ చేస్తూ, వారి స్థానంలో విదేశీయులను నియమించుకునే కంపెనీల హెచ్-1బీ దరఖాస్తులను అత్యంత నిశితంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తూ శనివారం మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
రిజిస్ట్రేషన్లు 92 శాతం డౌన్
గతంలో హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్‌కు 2 వేల నుంచి 5 వేల డాలర్లే ఖర్చయ్యేది. స్థానిక అమెరికన్ గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులకు లేబర్ మార్కెట్లో ప్రాధాన్యం పెంచేందుకు ట్రంప్ సర్కార్ 2025 సెప్టెంబర్‌లో ఈ లక్ష డాలర్ల రుసుము విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన కారణంగా గత ఏడాది కాలంలో పెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైనట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, అమెరికాలో ఇప్పటికే ఉంటూ వీసాలు రెన్యువల్ చేసుకునే వారికి, అలాగే ఎఫ్-1 వీసాపై అక్కడ చదువుకుని హెచ్-1బీకి మారే విద్యార్థులకు ఈ లక్ష డాలర్ల రుసుము వర్తించదని పేర్కొంది.
భారతీయ టెకీలపై ప్రభావం
అయితే హెచ్-1బీ వీసాల్లో భారతీయులదే అత్యధిక వాటా. అమెరికా తాజా గణాంకాల ప్రకారం ఆమోదమైన హెచ్-1బీ పిటిషన్లలో భారత్‌లో జన్మించిన వారి వాటా 71 శాతం. దీంతో కొత్త నిబంధనల ప్రభావం అమెరికా వెలుపల నుంచి హెచ్-1బీ ద్వారా వెళ్లాలనుకునే భారతీయ నిపుణులపై పడే అవకాశం ఉంది. ఈ రుసుముపై అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి.

