కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువ నాయకుడు, వ్యూహకర్త రుద్ర సంతోష్ కుమార్ (Rudra Santhosh Kumar) జాతీయ రాజకీయ యవనికపై తన ప్రత్యేక ముద్ర వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచి విజయవంతంగా నడిపించిన అనుభవానికి గుర్తింపుగా, ఏఐసీసీ (AICC) ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న “100 రోజుల జాతీయ కులగణన ఉద్యమానికి” ఏఐసీసీ జాతీయ వార్ రూమ్ కోఆర్డినేటర్‌గా రుద్ర సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానం నియామక పత్రాన్ని అందజేసింది.
తెలంగాణ ‘వార్ రూమ్’ విజయం – జాతీయస్థాయికి మార్గదర్శకం
తెలంగాణలో 2024–25లో నిర్వహించిన కులగణనను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడంలో సంతోష్ కుమార్ చూపిన చొరవ పార్టీ వర్గాల ప్రశంసలు అందుకుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో ప్రత్యేక వార్ రూమ్, కాల్ సెంటర్, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలను నెలకొల్పి ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో రోజుకు 2,000 మందికి పైగా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా కుల సంఘాలు, 35,000 మందికి పైగా బూత్ స్థాయి కార్యకర్తలను ఒకే తాటిపైకి తెచ్చారు. ఈ క్షేత్రస్థాయి సమన్వయ అనుభవమే ఇప్పుడు దేశవ్యాప్త క్యాంపెయిన్ రూపకల్పనకు ప్రధాన పునాదిగా మారింది.
ఢిల్లీ వేదికగా 45 నిమిషాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
సెప్టెంబర్ 8న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు అధ్యక్షతన జాతీయ ఓబీసీ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఓబీసీ జాతీయ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్, మైనారిటీ విభాగం జాతీయ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హితో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేదికపై రుద్ర సంతోష్ కుమార్ 100 రోజుల క్యాంపెయిన్‌కు సంబంధించిన 15 వారాల కార్యాచరణ ప్రణాళికను 45 నిమిషాల పాటు వివరంగా ప్రెజెంట్ చేశారు. ప్రతి రాష్ట్రంలో వార్ రూమ్‌ల ఏర్పాటు, మాస్టర్ ట్రైనర్ల ఎంపిక, శిక్షణ , జిల్లా, మండల, గ్రామ స్థాయి విస్తరణ, డిజిటల్ డేటా సేకరణ, వారపు ప్రగతి నివేదికలు, వంటి కీలక అంశాలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని వివరించి జాతీయ నాయకత్వం మెప్పు పొందారు.
100 రోజులు… 15 వారాలు
రాబోయే 100 రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ, మైనారిటీ, పౌర సమాజ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ కులగణనపై అవగాహన పెంచడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. జాతీయ వార్ రూమ్ కేంద్రంగా ప్రతి వారం రాష్ట్రాల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించడం, ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించే బాధ్యతలను సంతోష్ కుమార్ పర్యవేక్షిస్తారు.
జాతీయ స్థాయిలో మెరిసిన కరీంనగర్ బిడ్డ
ఒక సామాన్య స్థాయి నుంచి ప్రారంభమై, సాంకేతికతను – సమన్వయ సామర్థ్యాన్ని జోడించి తెలంగాణలో సాధించిన విజయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్ర సంతోష్ కుమార్‌కు జాతీయ స్థాయిలో ఈ రకమైన ప్రాధాన్యత దక్కడం కరీంనగర్ జిల్లాకే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.

