కలం, స్పోర్ట్స్: బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్ విధానంపై భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) ఫైర్ అయ్యారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ బీడబ్ల్యూఎఫ్‌ను హెచ్చరించారు. ఈ మార్పు ఆట స్వరూపాన్నే మార్చేస్తుందన్నారు. కొత్త విధానంతో కొందరు ఆటగాళ్లు లాభపడితే, మరికొందరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. బీడబ్ల్యూఎఫ్ (BWF) వచ్చే ఏడాది నుంచి 21 పాయింట్ల స్థానంలో 15 పాయింట్లతో మూడు గేమ్‌ల విధానాన్ని అమలు చేయనుంది. ఆటగాళ్లపై భారం తగ్గించడమే లక్ష్యమని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై గోపీచంద్ సందేహాలు వ్యక్తం చేశారు.
ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం..
గతంలో స్కోరింగ్ విధానం మారినప్పుడు తాను కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గోపీచంద్ (Pullela Gopichand) గుర్తు చేశారు. కొత్త విధానానికి అలవాటు పడేందుకు చాలా సమయం పట్టిందని చెప్పారు. ఇలాంటి మార్పులు కొందరి కెరీర్‌పై నేరుగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 15 పాయింట్ల ఫార్మాట్‌లో ప్రతి పాయింట్ అమూల్యమవుతుందన్నారు. పాయింట్లు సాధించడం కంటే, ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వకుండా ఉండటం మరింత ముఖ్యమని వివరించారు.
అసలు ఒత్తిడి అక్కడే..
బ్యాడ్మింటన్‌లో వేగం, శక్తి, ఏకాగ్రత, మానసిక ధైర్యమే విజయాన్ని నిర్ణయిస్తాయని గోపీచంద్ చెప్పారు. డబుల్స్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సర్వ్, సర్వ్ రిటర్న్, అటాక్ దశలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయని చెప్పారు. 11, 12 పాయింట్ల నుంచే అసలు ఒత్తిడి మొదలవుతుందని, చివరి దశలో మానసిక స్థైర్యమే తేడా చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలంటే టోర్నీల వ్యవధిని పెంచితే సరిపోయేదని గోపీచంద్ సూచించారు. స్కోరింగ్ తగ్గించి టోర్నీ రోజులు పెంచడం వెనుక ఉన్న కారణాలు బీడబ్ల్యూఎఫ్‌కే తెలుసన్నారు. కొత్త విధానంతో సృజనాత్మక షాట్ల కంటే వేగంగా, సేఫ్‌గా ఆడే ఆట పెరిగే అవకాశం ఉందని గోపీచంద్ అభిప్రాయపడ్డారు.
Also Read : ‘టాకింగ్ వెహికల్స్’ : రోడ్డు భద్రతకు కేంద్రం కొత్త రూల్
Follow Us On : WhatsApp

