కలం, వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) హెచ్చరించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇరిగేషన్, విద్యుత్, అంగన్వాడి శాఖల పనితీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా పనిచేస్తున్న అధికారులను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అని, నిర్లక్ష్యానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు, మౌలిక వసతులు, ప్రజా ఆస్తులను సంరక్షించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆన్‌లైన్ నమోదు, సాగు విస్తీర్ణం, పంటల వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులు, హాజరు, బోధన ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పంపిణీలో లోపాలు తలెత్తితే సంబంధిత అధికారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోకు ఆదేశించారు.
పెబ్బేరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెలు లేని వనపర్తి జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొంటూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పశుసంవర్థక శాఖ అధికారులు గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచాలని, భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ యాదయ్య, ఎమ్మార్వో, ఎంపీడీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

