కలం, స్పోర్ట్స్: అప్పుగా తీసుకున్న స్పైక్స్‌తో క్రికెట్ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ (Akib Nabi).. ఇప్పుడు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో శ్రీలంక పర్యటనకు ఆయనను ఎంపిక చేశారు. అకిబ్ ప్రయాణం అంత సులభం కాదు. అండర్-19 ట్రయల్స్‌కు వెళ్లే సమయంలో ఆయన వద్ద బౌలింగ్ స్పైక్స్ కూడా లేవు. స్నేహితుడి నుంచి అప్పుగా తీసుకుని ట్రయల్స్ ఆడారు. జట్టుకు ఎంపికైన తర్వాత కూడా అదే స్పైక్స్‌తో తొలి టోర్నీ పూర్తి చేశారు.
బరాముల్లాలో సరైన సాధన సౌకర్యాలు లేకపోవడంతో ప్రతిరోజూ శ్రీనగర్ వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఈ కష్టాలను ఎప్పుడూ సాకుగా తీసుకోలేదని అకిబ్ చెప్పారు. భారత్‌కు ఆడాలంటే సాకులు వెతకకూడదని, లక్ష్యం కోసం ఎంత కష్టమైనా పడాలని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీర్ బౌలింగ్ కోచ్ పి. కృష్ణకుమార్ మార్గదర్శకత్వంలో అకిబ్ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నారు. అవుట్స్వింగ్తో పాటు ఇన్‌స్వింగ్‌ను కూడా నేర్చుకుని మరింత ప్రభావవంతమైన బౌలర్‌గా ఎదిగారు.
గత రెండు రంజీ సీజన్లలో అకిబ్ 104 వికెట్లు తీశారు. ఇటీవల ఇండియా-ఏ తరఫున శ్రీలంక పర్యటనలో రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో తొలి అవకాశం అందుకున్నారు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో బరాముల్లాలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యమని అకిబ్ తెలిపారు. తనలాంటి యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

