కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు భూమికి విధించిన వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గడి బురుజు భూమి కోరుట్ల పట్టణానికి చారిత్రక, ప్రజా ప్రాధాన్యం కలిగిన ఆస్తి అని ఎమ్మెల్యే సంజయ్ వివరించారు. దానిని ప్రజా ప్రయోజనాల కోసం పరిరక్షించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలపై..
విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కలెక్టర్ సత్యప్రసాద్‌కు మరో వినతిపత్రం సమర్పించారు. నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. విద్యాసంస్థలు ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తెస్తూ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

