కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం రైతులకు (AP Farmers) తీపి కబురు అందించింది. ఖరీఫ్ పంటల బీమా గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. జూలై 31వ తేదీతో ముగియాల్సిన గడువును మరో 15 రోజుల పాటు అంటే ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, వర్షాభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ. 1 బీమా పథకం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని ఏపీ సర్కార్ వివరించింది. రైతులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే బీమా నమోదు చేసుకోవాలని సూచించింది. రైతులు సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీని వల్ల వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు పూర్తి నష్టపరిహారం ఉంటుందని తెలిపింది. రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, సీఎస్సీ కేంద్రాలు, NCIP మొబైల్ యాప్‌ల ద్వారా పంట బీమా నమోదు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

