కలం, వెబ్ డెస్క్: కర్నాటక (Karnataka) లో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) చేపట్టింది. లోక్ భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ 20 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మంత్రివర్గం రాజ్యాంగం ప్రకారం అనుమతించిన గరిష్ఠ సంఖ్య 34కు చేరుకుంది. మంత్రి పదవుల కోసం కొన్ని వారాలుగా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ప్రాంతీయ, సామాజిక, వర్గ సమీకరణాలతో పాటు అనుభవజ్ఞులు, కొత్తవారికి సముచిత ప్రాధాన్యం కల్పించేలా అధిష్ఠానం తుది జాబితాను ఖరారు చేసింది. బెంగళూరు, హైదరాబాద్-కర్నాటక, ముంబై-కర్నాటక, పాత మైసూరు, తీర ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించిన ఈ జాబితాలో 12 మంది తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కినవారు ఉండగా, 8 మంది గతంలో మంత్రులుగా చేసినవాళ్లు ఉన్నారు.
భగ్గుమన్న అసంతృప్తి
మంత్రి పదవులు ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా యశవంతరాయగౌడ పాటిల్(ఇండి నియోజకవర్గం)కు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం వరకు తన పేరు తుది జాబితాలో ఉందని, చివరి నిమిషంలో తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడితే ఇచ్చిన బహుమతి ఇదేనా అని ఆయన మండిపడ్డారు. బేలూరు ఎమ్మెల్యే కె.ఎస్. గోపాలకృష్ణ కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరోవైపు, పదవులు దక్కని ఆశావహుల మద్దతుదారులు, కార్యకర్తలు బెంగళూరులో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రతి ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని, పార్టీ ప్రయోజనాలు, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు పార్టీ, ప్రభుత్వంలో తగిన బాధ్యతలు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ మంత్రివర్గ విస్తరణతో ప్రభుత్వానికి పరిపాలనా పరంగా మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుండగా, మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలా సమన్వయం చేస్తుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
కొత్త మంత్రులు వీరే..
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పీఎం నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లామణి, కేఎస్ బసవంతప్ప, బీ నాగేంద్ర, టీ రఘుమూర్తి, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాల్ వైద్య, అజయ్ సింగ్, ఎన్ చెలువరాయ స్వామి, కేఎమ్ శివలింగే గౌడ, హెచ్‌సీ బాలకృష్ణ, గాయత్రి శాంతెగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, లక్ష్మణ్ సవది ఉన్నారు. కాగా, కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా గాయత్రి శాంతేగౌడ చోటు దక్కించుకుంది. అలాగే, శాసనసభ నూతన స్పీకర్‌గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్ పొన్నన్న, మండలి చైర్మన్‌గా సలీమ్ అహ్మద్, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది.

