కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత (Uravakonda YSRCP Protest) నెలకొంది. టీటీడీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిని (Visweswara Reddy) పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ఆందోళన చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వేశ్వర రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పార్టీ ఆఫీసు నుంచి బలవంతంగా వాహనంలో ఎక్కించి తరలించారు.
పోలీసుల అరెస్ట్..
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వైసీపీ శ్రేణులు, పోలిసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ బలగాలు పరిస్థితిని అదుపుచేసి చక్కదిద్దారు. విశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.
పయ్యావులవి కుట్ర రాజకీయాలు.. వైసీపీ ఫైర్
ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చామని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తమ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విడపనల్ మండలం వేల్పుమడుగులో వైసీపీ నేత గోవింద్ కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని ఆరోపించారు.
ఆ భూమి ప్రైవేటు భూమి అని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని.. ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా గోవింద్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని స్థానిక పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగానే హైకోర్టు ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది.

