కేరళలో భారీ వర్షాలు.. 11 మంది మృతి, విద్యాసంస్థల బంద్

కలం, వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కేరళను (Kerala Floods) అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. వరదల కారణంగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కొల్లం, తిరువనంతపురం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పంపా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో పథనంతిట్ట జిల్లాకు అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేశారు. పంపా నది, కక్కడ్ ఉపనది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

273 సహాయక శిబిరాలు..

భారీ వర్షాలకు అగమ్యగోచరంగా మారిన ప్రజల కోసం రాష్ట్రవ్యాప్తంగా 273 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో 7,674 మంది ఆశ్రయం పొందుతున్నారు. భారీ వరదలకు కొండచరియలు విరిగిపడటంతో 30 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా.. 293 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేసే పనులు ప్రారంభించినప్పటికీ, పేరుకుపోయిన బురద, మట్టి కారణంగా బాధితులు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు.

విద్యాసంస్థలు బంద్..

భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, త్రిసూర్, ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ఇచ్చారు. అలప్పుళ జిల్లాలో పునరావాస కేంద్రాలుగా మార్చిన విద్యా సంస్థలతో పాటు, వరద ముప్పు ఎక్కువగా ఉన్న చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, అంగన్‌వాడీలు, ట్యూషన్ సెంటర్లకు కూడా సెలవు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>