కలం, ఖమ్మం బ్యూరో : తెలుగు నేలపై రాజకీయ చైతన్యానికి మారుపేరు… మలి దశ తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండా తిరుగులేని ప్రభంజనం సృష్టించిన గడ్డ ఉమ్మడి ఖమ్మం! సైన్యంలా కదిలే కార్యకర్తలు, నియోజకవర్గాలపై బలమైన పట్టున్న అగ్రనేతలతో శత్రు దుర్భేద్యమైన కోటగా వెలిగిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు కాలం పరీక్ష పెడుతోంది. రాష్ట్రంలో అధికార పీఠం చేజారడం ఒకెత్తయితే.. కష్టకాలంలో పార్టీని ఒడ్డుకు చేర్చాల్సిన నాయకులు ఓవైపు ‘ఆధిపత్య పోరు’తో వీధిన పడటం, మరోవైపు ‘సంచలన కేసుల’ చట్రంలో చిక్కుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ (Khammam BRS) ధీమా పూర్తిగా చెదిరిపోయిందనే చెప్పాలి.
నిన్నమొన్నటి వరకు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు దాపురించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల టికెట్ వివాదంతో మొదలైన ఈ విభేదాలు.. పార్టీ ఓటమితో తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. చివరికి కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలు జిల్లాకు వచ్చినా ఈ ఇద్దరూ ఎదురెదురు పడితే ముఖాలు తిప్పుకునే స్థాయికి వైరం ముదిరిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖమ్మంలో ముఠా తగవులు.. కొత్తగూడెంలో లీగల్ సెగలు
ఇటీవల కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ ఆఫీసులో ఒకరు, క్యాంప్ ఆఫీసులో మరొకరు పోటీపడి నిర్వహించడంతో కథ అడ్డం తిరిగింది. నేతల పంతాల మధ్య నలిగిపోలేక, ఏ నాయకుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని భయపడి సాధారణ కార్యకర్తలు ఆ వేడుకలకే దూరంగా ఉండిపోయారు. అక్కడ ఖమ్మంలో ముఠా తగవుల రచ్చ నడుస్తుంటే.. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతకంటే ఘోరమైన ‘లీగల్ సెగలు’ పార్టీని కుదిపేస్తున్నాయి.
జనవరి 2022లో పాత పాల్వంచను వణికించిన ఒక కుటుంబం దారుణ ఆత్మహత్య ఘటన, అందులో నాటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై వచ్చిన ఆరోపణలు గులాబీ పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చిపెట్టాయి. ఆ చేదు జ్ఞాపకాల తీవ్రత ఇంకా తగ్గకముందే… తాజాగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన లైంగిక వేధింపుల కేసు శ్రేణులకు పిడుగుపాటులా తగిలింది. ఆయన ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ప్రజా క్షేత్రంలో జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.
ఇలా ఒకవైపు ఖమ్మంలో ఆధిపత్య పోరు, మరోవైపు భద్రాద్రిలో అగ్రనేతల చుట్టూ ముసురుకున్న నైతిక, నేరపూరిత ఆరోపణల సుడిగుండం బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. నడిపించాల్సిన నేతలే పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో… సమన్వయం లోపించి కొత్తగూడెం మేయర్ పీఠం కూడా చేజారిపోయింది. ప్రత్యర్థి పార్టీలు ఈ బలహీనతలను పదునైన పొలిటికల్ అస్త్రాలుగా మలుచుకుంటుంటే, ఊరూరా ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగువ స్థాయి కేడర్ ఆత్మరక్షణలో పడిపోయింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వచ్చే తీర్పులు, పోలీసుల దర్యాప్తు ఒకవైపు.. కట్టుతప్పుతున్న ఖమ్మం నేతలకు అధిష్ఠానం వేసే కళ్లెం మరోవైపు! ఈ రెండు పరిణామాలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ కోట భవిష్యత్తును, బీఆర్‌ఎస్ ఉనికిని నిర్ణయించబోతున్నాయి.

