కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరులో ఊర పండుగ (Oora Panduga) అంగరంగ వైభవంగా జరిగింది. ఖిల్లా రామాలయం వద్ద ఉన్న ఆలయం నుంచి కొత్తగా తయారు చేసిన దేవతా మూర్తుల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. 12 గ్రామ దేవతలను నలు దిక్కులా ఊరేగిస్తూ ఆయా ఆలయాలకు తీసుకెళ్లారు. శోభాయాత్రలు జరిగిన ప్రధాన రహదారులు మొత్తం భక్త జన సంద్రంగా మారాయి.
భక్తులు జనాలు ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలు ఆయా వీధుల్లో ఉన్న జనాలు అంతా అమ్మ వార్లకు స్వాగతం పలుకుతూ రోడ్లపై నీళ్ళు పోశారు. అమ్మ వార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టారు. మేకలు గొర్రెలు కోళ్ళు ఎదురు ఎగరేసి బలి ఇచ్చారు. అలా చేయడం వల్ల కుటుంబాల్లోని పిల్లా పాపలు, చిన్నా పెద్దలు ఎవరికీ కూడా అంటువ్యాధులు ప్రబలవని కీడు సోకదని విశ్వాసం.
మరోవైపు ర్యాలీ లేని నగరంలో ప్రతి వీధిలో ఎక్కడిక్కడ కూడళ్ల వద్ద రాళ్ళు ఏర్పాటు చేసి అమ్మవార్లుగా భావించి పూజలు బలులు కొనసాగాయి. ఇక ఊరేగింపు వెళ్తున్న సందర్భంలో కూడా జనసందోహం కనిపించింది. అమ్మ వార్లు వెళ్తుంటే కింద నుంచి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం , అందరూ ఎదురుగా కూర్చుంటే వారి పై నుంచి అమ్మ వారి పల్లకిని తీసుకెళ్ళే దృశ్యాలు ప్రత్యేకంగా కనిపించాయి. ఈ సమయంలో సరి అనే ప్రసాదం చల్లుకుంటూ వేరే వాహనాలు వెళ్ళాయి.
మొత్తానికి నిజామాబాద్ నగరం మొత్తం ఆదివారం ఊర పండుగ (Oora Panduga) వాతావరణం నిండుగా కనిపించింది. నగర బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, సర్వ సమాజ్ కన్వీనర్ యెండల లక్ష్మీ నారాయణ, మేయర్ ఉమారాణి , నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు సర్వ సమాజ్ కో కన్వీనర్ ఆదే రాజు, కుల పెద్దలు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Also Read : కంటి చుక్కల్లోనూ కల్తీ..! ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ
Follow Us On: X(Twitter)

