కలం, వెబ్ డెస్క్ : దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసన ప్రదర్శనలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ (Ruchika Singh) ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో పాటు పోలీసులు కేసు నమోదు చేయడంతో, సదరు యువతి తాజాగా ఒక క్షమాపణల వీడియోను విడుదల చేసింది. తాను చేసిన పనికి దేశ ప్రజలందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నానని, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, తన వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమేనని, తనను క్షమించాలని ఆమె ఆ వీడియోలో కోరింది.
అయితే, ఆమె చేస్తున్న ఈ మైనర్ వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ రికార్డుల ప్రకారం ఎఫ్ఐఆర్ లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీనికి తోడు, ఆమె గతంలో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లిన ఒక సెలూన్ యజమాని ద్వారా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రుచికా సింగ్ తన అసలు పేరును దాచి, మైన్సిల్ జైన్ అనే నకిలీ పేరుతో ఆ సెలూన్ లో చేరినట్లు సదరు యజమాని వెల్లడించారు. శిక్షణలో భాగంగా గుర్తింపు కార్డు కోసం ఆధార్ కార్డు సమర్పించాల్సిందిగా కోరడంతో, ఆమె ఆ సెలూన్ కు రావడం పూర్తిగా మానేసిందని స్పష్టం చేశారు.
మరోవైపు, రుచికా సింగ్ (Ruchika Singh) నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని అంటూ వస్తున్న వార్తలను కూడా సెలూన్ యజమాని తోసిపుచ్చారు. ఆమె కేవలం 10 లేదా 12వ తరగతి వరకు మాత్రమే చదివి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమె నిజంగా 15 ఏళ్ల మైనర్ అయితే, నకిలీ పేరుతో చలామణి కావడం, యజమాని అడిగినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వకుండా నిరాకరించడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని గుర్తించి, ఈ వ్యవహారం వెనుక అసలు కారణాలను, దీని వెనుక ఉన్న శక్తులను విచారించాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి.

