హాకీ జెర్సీ వివాదం.. అధ్యక్షుడికే తెలియదా?

కలం, స్పోర్ట్స్: భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పు వివాదం మరింత ముదిరింది. జాతీయ జట్టు సాంప్రదాయ నీలం రంగు జెర్సీ స్థానంలో కాషాయ రంగు ప్రాధాన్యంగా ఉన్న కొత్త డిజైన్‌ను తీసుకురావడంపై చర్చ జరుగుతున్న వేళ.. ఈ నిర్ణయం తనకు తెలియకుండానే జరిగిందని హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు దిలీప్ తిర్కీ (Dilip Tirkey)  వెల్లడించారు. ఈ అంశంపై ఆయన హాకీ ఇండియా కార్యవర్గ సభ్యులకు ఈమెయిల్ పంపించారు. జెర్సీ రంగు మార్పు ఎలా జరిగింది? ఎవరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏ విధానాన్ని అనుసరించారు? అనే అంశాలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అధికారులను కోరారు.

హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమాండర్ ఆర్‌కే శ్రీవాస్తవకు కూడా దిలీప్ తిర్కీ ప్రత్యేకంగా లేఖ పంపించారు. జూలై 31 సాయంత్రం 5 గంటలలోపు పూర్తి వివరాలను కార్యవర్గ సభ్యులకు అందించాలని సూచించారు. అధ్యక్షుడు, కార్యవర్గానికి సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరించాలని కోరారు. ఇటీవల ప్రపంచకప్ కోసం భారత హాకీ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతంలో ఉన్న సంప్రదాయ నీలం రంగుకు బదులుగా కాషాయ రంగు ఎక్కువగా ఉండేలా డిజైన్ చేయడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. దీనిపై రాజకీయ వర్గాల నుంచి కూడా స్పందనలు వచ్చాయి. అయితే హాకీ ఇండియా మాత్రం ఇది కేవలం క్రీడాపరమైన నిర్ణయమని, డిజైన్ మార్పులో భాగంగానే కొత్త రంగును తీసుకొచ్చామని స్పష్టం చేసింది. జెర్సీ రంగుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని దిలీప్ తిర్కీ తెలిపారు.

“జాతీయ జట్టు గుర్తింపుకు సంబంధించిన ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్నికైన నాయకత్వం, కార్యవర్గంతో చర్చించాల్సి ఉంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టు ప్రపంచకప్ సన్నాహకాలపై ప్రభావం పడకుండా ఈ అంశాన్ని క్రీడా పరంగా మాత్రమే చూడాలని తెలిపారు. ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం కూడా వివరణ కోరినట్లు దిలీప్ తిర్కీ వెల్లడించారు. ఇలాంటి కీలక నిర్ణయాలలో పారదర్శకత అవసరమని, సమష్టి నిర్ణయ ప్రక్రియ పాటించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, హాకీ ఇండియా పరిపాలనపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. మాజీ భారత కెప్టెన్, హాకీ ఇండియా ఉపాధ్యక్షురాలు అసుంతా లక్రా చేసిన ఫిర్యాదుల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై క్రీడా మంత్రిత్వ శాఖ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ద్వారా స్వతంత్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. తాజా పరిణామాలతో జెర్సీ రంగు మార్పు మాత్రమే కాకుండా.. హాకీ ఇండియాలో నిర్ణయాలు తీసుకునే విధానంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>