కలం, వెబ్ డెస్క్: ఆడపిల్ల పుట్టిందని సొంత నానమ్మనే చంపేందుకు ప్రయత్నించిన ఘటన అనంతపురం (Anantapur) జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. పూజిత అనే మహిళకు రెండు నెలల కిందట ఆడ పిల్ల జన్మించింది. పుట్టుకతో ఫిట్స్ ఉండటంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేయాలని సూచించిన డాక్టర్లు.. పిల్లల వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి పూట ఎత్తుకెళ్లి..
ఆడపిల్ల పుట్టిందని మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న నానమ్మ సత్యమ్మ.. దారుణానికి పాల్పడ్డారు. రెండు రోజుల కిందట పిల్లల వార్డు నుంచి ఎత్తుకెళ్లి రెండో అంతస్తు నుంచి కింద పడేశారు. ఆసుపత్రి సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. సత్యమ్మనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అదృష్టవశాత్తూ పాపకు చిన్న గాయాలే అయ్యాయని, చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరీ తెలిపారు.

