epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోషల్​ మీడియా బ్యాన్​పై మద్రాస్​ హైకోర్ట్​ సంచలన ప్రకటన

కలం, వెబ్​డెస్క్​: పిల్లలకు సోషల్​ మీడియా వాడకుండా బ్యాన్​​ (Social media ban)  విధించడం​పై మద్రాస్​ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్​ మీడియా వాడకుండా ఆస్ట్రేలియాలో తెచ్చిన చట్టం లాంటిది మన దేశంలోనూ తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఆలోగా అశ్లీల కంటెంట్, చైల్డ్​ ఫోర్నోగ్రఫీ దుష్ప్రభావాలపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇంటర్నెట్​లో అసభ్య, అశ్లీల సమాచారం విచ్చలవిడిగా, సులభంగా అందుబాటులో ఉందని మద్రాస్​ హైకోర్టు మధురై బెంచ్​లో దాఖలైన పిటిషన్​ను జస్టిస్​ జయచంద్రన్​, జస్టిస్​ కె.రామకృష్ణన్​లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

పదహారేళ్ల లోపు పిల్లలు ఫేస్​బుక్​, ఎక్స్​, ఇన్​స్టాగ్రామ్​, టిక్​టాక్​ వంటి సోషల్​ మీడియా మాధ్యమాలు వాడకుండా నిషేధిస్తూ (Social media ban) ఇటీవల ఆస్ట్రేలియా చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులపై ఆంక్షలు కాకుండా సోషల్​ మీడియా మాధ్యమాలను అందించే కంపెనీల కట్టడికి ఉద్దేశించింది. ఈ చట్టం గురించి ప్రస్తావించిన మద్రాస్​ హైకోర్ట్​ మన దేశంలోనూ ఈ తరహా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ఆస్ట్రేలియాలో చేసిన చట్టం లాంటి దానిని మన దేశంలోనూ తీసుకొచ్చే అవకాశాలను కేంద్రం పరిశీలించాలి. ఆ చట్టం కార్యరూపం దాల్చేవరకు చైల్డ్​ ఫోర్నోగ్రఫీ దుష్ప్రభావాలపై సంబంధిత అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దీని కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల సాధనాలను వాడుకోవాలి. అవసరమైన ప్రణాళికను బాలల హక్కుల రక్షణ సంస్థ తయారుచేసి, సమర్థంగా, నిబద్ధతతో అమలు చేయాలి.’ అని ధర్మాసనం​ పేర్కొంది.

చైల్డ్​ ఫోర్నోగ్రఫీ, అశ్లీల కంటెంట్​ నియంత్రణకు ఇంటర్నెట్​ సర్వీస్​ ప్రొవైడర్లు(ఐఎస్​పీ) తగిన చర్యలు తీసుకుంటున్నారని వాళ్ల తరఫు లాయర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఇదే విషయాన్ని చెప్తూ.. పిల్లలకు అశ్లీల కంటెంట్​ అందకుండా చేయడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ్యత కూడా ఉందని వ్యాఖ్యానించింది. దీనికోసం అవసరమైన యాప్​ను తల్లిదండ్రులకు అందుబాటులో తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ‘పిల్లలపై అశ్లీల కంటెంట్ ​దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. అందువల్ల దానిని ఎదుర్కోవాలంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత బాధ్యతగా ఉండాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read Also: సితార బ్యానర్‌లో నాని కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>