కలం, ఖమ్మం బ్యూరో: వినియోగదారులను తక్కువ తూకాలతో మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం (Bhadrachalam) తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ కె. సుభాష్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని నేరుగా కోర్టుకు పంపించి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పలు వ్యాపార ప్రాంతాలలో ఆదివారం తూనికలు, కొలతల శాఖ (Weights Department) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు వ్యాపారులలో కలకలం రేపాయి.
ఈ తనిఖీలలో సుమారు పది దుకాణాలలో తప్పుడు తూకాలతో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మిల్క్ సెంటర్‌లు , మటన్ షాపులు, ఐరన్ షాపులు, చికెన్ దుకాణాలలో తక్కువ కొలతలతో విక్రయాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కె. సుభాష్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రతి గ్రాము, ప్రతి లీటరు సరైన కొలతలతో అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని అన్నారు. వ్యాపారులు తమ పద్ధతులను మార్చుకుని ఖచ్చితమైన తూనికలతో విక్రయాలు జరపాలని సూచించారు. తూకాల మోసాలపై శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, నిబంధనలు అతిక్రమించే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని, జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
Read Also: పరీక్షల సంస్కరణలపై మోదీ కీలక ప్రకటన!
Follow Us On: Instagram

