కలం, వెబ్‌డెస్క్: దేశానికి సరిహద్దుగా ఉన్న గ్రామాలే దేశ మొదటి గ్రామాలని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ (Viksit Vibrant Village Programme) లో ప్రధాని మోదీ నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. మై భారత్ ద్వారా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. సరిహద్దు గ్రామాలను దేశానికి మొదటి గ్రామాలుగా భావించాలని సూచించారు. అలాగే వికసిత్ భారత్ నిర్మాణ ప్రయాణంలో సరిహద్దు గ్రామాల భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026ను రెండు దశల్లో జూన్ 4 నుంచి జూన్ 30 వరకు నిర్వహించారు. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రంట్ గ్రామాలను ఈ కార్యక్రమం కవర్ చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ పోటీలో మూడు లక్షలకు పైగా యువత పాల్గొన్నారు. అందులో నుంచి ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే 400 మందికి పైగా యువతను ఎంపిక చేశారు.
సరిహద్దు భద్రత గురించి యువత తమ అనుమానాలు, అభిప్రాయాలను మోదీతో పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు వర్చువల్‌గా 5 వేల మంది యువత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అలాగే ప్రజల భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

