కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ మన అందరి బాధ్యతగా గుర్తించాలని మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ ఎన్ బి రత్నం అన్నారు. జిల్లా ఎస్పీ డి.జానకి, ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ (Mahabubnagar Police) కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దాయిపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఆదివారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని మొత్తం 45 వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1 కారు, 3 ఆటోలు, 41 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఆయా వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనల మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అలాగే నేరస్థులు, పాత నేరస్తులను గుర్తించేందుకు వేలిముద్రల విశ్లేషణ పరికరం ద్వారా సుమారు 100 మంది వ్యక్తులను తనిఖీ చేయగా, 7 మంది అనుమానితులను గుర్తించారు. వారి నేపథ్యంపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. సోదాల అనంతరం కాలనీవాసులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాలు, కాలనీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100/112 నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రమణారెడ్డి, 1-టౌన్ ఇన్ స్పెక్టర్ అప్పయ్య, భూత్పూర్ ఎస్ఐ రామకృష్ణ, భూత్పూర్ సబ్ ఇన్ స్పెక్టర్ నాగన్న పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

