ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: అవినీతి, అసమర్థ విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారని.. ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్టుబట్టారు. నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు 3 డిమాండ్లు ఉన్నాయని, వాటి విషయంలో విద్యార్థులు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మారుస్తారనే చర్చ జరుగుతోందని చెప్పారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఎందుకంటే ధర్మేంద్ర అవినీతికి, పిల్లల నాశనానికి చిహ్నమని మండిపడ్డారు. అక్కడికీ, ఇక్కడికీ పంపడం కాదు.. కచ్చితంగా పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం వేధిస్తోంది..

తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని.. వారి హక్కులను అణచివేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలీస్ బలాన్ని ఉపయోగించి కఠిన చర్యలతో ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తమ హక్కులను అడుగుతున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ క్రూరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘ ఢిల్లీలో మెట్రోలు, రహదారులు, దుకాణాలు, ఇంటర్నెట్.. చివరికి అన్నం పెట్టడం కూడా ఆపేయండి.. కానీ, ఒక్క విషయాన్ని మాత్రం మోదీ బంద్ చేయలేకపోయారు. అదే.. మోదీ గారు.. పేపర్ లీక్’ అంటూ విమర్శించారు.

మోదీపై ఫైర్..

శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.  దేశ విద్యార్థులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువత భవిష్యత్తు, న్యాయం, పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “నరేంద్ర మోదీ భారతదేశ గతం.. గతం ఎప్పటికీ భవిష్యత్తుతో పోరాడలేదు.” అంటూ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>