కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతున్న బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam). చాన్నాళ్లకు వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో .. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో ‘నారా రోహిత్’ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారికా & హాసినే క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. నేడు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. “ఆదర్శ కుటుంబంలోకి ఓ ఆసక్తికరమైన చేరిక. నారా రోహిత్ ఇప్పుడు ‘AK47’ టీమ్‌లో భాగమయ్యారు” అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఈ సినిమాలో నారా రోహిత్ పోషించే పాత్రపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారికా & హాసినే క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించగా.. వెంకటేష్, నారా రోహిత్‌ల కలయికతో ఈ సినిమాపై అభిమానులలో మరింత ఆసక్తి ఏర్పడింది.

