కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శాఖ (Health Department) కు రూ.740 కోట్లను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను నేడు జారీ చేశారు.
ఈ నిధులతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,569 ప్రైమరీ హెల్త్ సెంటర్లు నిర్మించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే గ్రామాల్లోనే ఉచిత డయాగ్నస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు వెల్లడించారు. పేదలకు ఆరోగ్యాన్ని హక్కుగా మార్చాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్య రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆరోగ్య సేవల్లో నాణ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

