వనపర్తి పోలీసుల ఘనత.. నెల రోజుల్లోనే 236 మొబైల్ ఫోన్ల రికవరీ

కలం, వనపర్తి: పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతికతతో గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో వనపర్తి జిల్లా పోలీసులు (Wanaparthy Police) మరోసారి ప్రతిభ చాటారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’ (Mobile Recovery Mela) లో సుమారు రూ. 65 లక్షల విలువైన 236 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల కష్టార్జిత ఆస్తిని తిరిగి వారికి చేర్చడం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే కర్తవ్యమని అన్నారు. సీఈఐఆర్ (CEIR) వ్యవస్థను సమర్థంగా వినియోగించడం ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక రికవరీ బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు వెల్లడించారు.

రికవరీ చేసిన ఫోన్లలో తెలంగాణ నుంచి 196, ఆంధ్రప్రదేశ్ నుంచి 15, కర్ణాటక నుంచి 8, మహారాష్ట్ర నుంచి 9, మధ్యప్రదేశ్ నుంచి 6, కేరళ నుంచి 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ఫిర్యాదు కోసం ఎలాంటి చలాన్లు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు వంటి కీలక సమాచారం ఉంటుందని, ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో బ్లాక్ చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా విక్రేత నుంచి రసీదు తీసుకోవాలని, దొంగిలించిన ఫోన్లు కొనుగోలు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాధితుల ముఖాల్లో చిరునవ్వులు.. పోలీసులకు కృతజ్ఞతలు

పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకవని భావించిన బాధితులు వాటిని తిరిగి అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీతో పాటు రికవరీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

రికవరీ బృందానికి ఎస్పీ ప్రశంసలు.. నగదు బహుమతి

మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్ కుమార్, ఎస్సై రామరాజు, ఏఎస్సై తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఎస్పీ నగదు బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్, సీసీఎస్ సీఐ పవార్ అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు సీఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>