కలం, దేవరకొండ: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే ప్రాణమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చూడటంతో పాటు దానిని పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) స్పష్టం చేశారు. డిండి పట్టణం, చెర్కుపల్లి గ్రామాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ఓటు కేవలం హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు పాత్ర కీలకమన్నారు. SIR ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలన్నారు.
అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోతే వెంటనే గుర్తించి, అవసరమైన ఫారమ్‌లు పూర్తి చేయించి తిరిగి ఓటరు జాబితాలో చేర్పించాలని తెలిపారు. మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఓటర్లకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహాయం అందించాలని పిలుపునిచ్చారు. “ఓటు హక్కును కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యంలో తమ గొంతును కోల్పోవడమే. ఎన్నికల రోజే కాకుండా, ఓటును కాపాడుకోవడంలోనూ పౌరులు భాగస్వాములు కావాలి. ప్రతి బూత్‌లో ఏ ఒక్క అర్హుడి పేరు కూడా మిస్ కాకుండా చూడాలి.” అని బాలు నాయక్ చెప్పుకొచ్చారు.

