కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు (Nirmal Youth Dies). ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్న నిత్యానందరెడ్డి (26) ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందినవాడు.
గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిత్యానందరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన ఆయన స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ కావడంతో గురువారం ఆయన కన్నుమూశారు. దీంతో నర్సాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

