కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించేందుకు కొత్తగూడెం కార్పొరేషన్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘జియో సైన్స్ లేబరేటరీ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka) మల్లు గురువారం ప్రారంభించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ అంకిత్ స్వాగతం పలికారు. అనంతరం ల్యాబ్‌లోని యంత్ర పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ సాంకేతికతను డిప్యూటీ సీఎం పరిశీలించగా.. పరీక్షా విధానాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.
ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ విశ్లేషణ వేగంగా, కచ్చితత్వంతో జరుగుతుందని, గనుల నిర్వహణకు సాంకేతిక సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, సింగరేణి సి.ఎమ్.డి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్ పొట్రూ, మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

