కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రశ్నపత్రాల లీకేజీ తో విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకం లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మహబూబ్ నగర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
లీకేజీల పుణ్యమా అంటూ విద్యార్థులు కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని, సీట్ వస్తుందనే నమ్మకం లేకుండా పోయిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు . ఇప్పటి వరకు 150 సార్లు పేపర్లు లీక్ అయితే బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించిందన్నారు. ఢిల్లీలో విద్యార్థి, యువకులపై పోలీసులు లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
కాక్రోచ్ పార్టీ ఆందోళనతో విద్యార్థులు.. యువత కదిలి రావడంతో రాహుల్ గాంధీ హడావుడిగా మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారే తప్ప నిజంగా విద్యార్థుల కోసం కాదన్నారు. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుందని ఆయన విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు రాష్టాలకు రాష్ట్రాలకు ఇవ్వకపోవడం మూలంగానే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ పథకం మూసి వేయడంతో పేద విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు.. పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఢిల్లీ ఆందోళన సమయంలో విద్యార్థులు..యువతపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

