కలం, వనపర్తి: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నెల రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేతకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిరంజన్ రెడ్డి గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గం నుంచి విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల కారణంగా దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించిన ఆయన, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా ఉద్యమించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, అలాంటి హక్కులను కాలరాస్తూ విద్యార్థులపై అణచివేతకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, చెన్నారం రమేష్, మహమూద్, బండారు కృష్ణ, చంద్రశేఖర్, డాక్టర్ డ్యానియల్, భాగ్యరాజ్, సయ్యద్ జమీల్, బాబు నాయక్, అస్లాం, ఇమ్రాన్, జిల్లా విద్యార్థి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్, యువత అధ్యక్షుడు సూర్యవంశం గిరి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జోహెబ్ హుస్సేన్, యూసుఫ్, మండల యువత అధ్యక్షుడు చిట్యాల రాము, మునికుమార్, క్రాంతి, లక్ష్మణ్ గౌడ్, శివప్రసాద్ గౌడ్, శ్రీవాటి శంకర్, కుమార్, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

