కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) తెలిపారు. గురువారం నాడు ఎన్ఎస్పీ మెయిన్ బ్రాంచ్ కాలువ వద్ద వేగంగా ప్రవహిస్తున్న గోదావరి జలాలను డిప్యూటీ సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ‘ఎల్ నినో’ ప్రతికూల తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దుమ్ముగూడెం జలాలతో వైరా చెరువును భర్తీ చేసే ప్రక్రియను ప్రజా ప్రభుత్వం అత్యంత వేగంగా ప్రారంభించింది.
గత సమీక్షా సమావేశంలో భట్టి (Bhatti Vikramarka) జారీ చేసిన ఆదేశాల మేరకు స్పందించిన యంత్రాంగం, క్షేత్రస్థాయిలో నీటి తరలింపు ప్రక్రియను శరవేగంగా అమలులోకి తెచ్చింది.ఈ కార్యాచరణలో భాగంగా భద్రాచలం వద్ద ఉన్న దుమ్ముగూడెం నుండి రాజీవ్ కాలువ ద్వారా గోదావరి వెనుక జలాలను, నాగార్జునసాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ మీదుగా నేరుగా వైరా చెరువుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా నీటి తరలింపు విధానాన్ని, ప్రవాహ వేగాన్ని డిప్యూటీ సీఎం భట్టి అధికారులతో కలిసి సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రధాన చెరువులను కూడా ఈ గోదావరి జలాలతో త్వరితగతిన నింపాలని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ నీటి కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని భట్టి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత కాలంలో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సాగర్ మెయిన్ బ్రాంచ్ ద్వారా గోదావరి జలాలు వైరా చెరువుకు చేరుతుండటంతో ఖమ్మం జిల్లా ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ హయాంలో 53 లీకులు.. ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా?: రాంచందర్ రావు
Follow Us On : WhatsApp

