హైడ్రా కమిషనర్ ను అరెస్టు చేయండి : హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మల్కాజ్‌గిరి మండలం లోతుకుంటలోని వివాదాస్పద భూముల విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు ప్రైవేట్ స్థలంలోకి పదేపదే ప్రవేశించడంపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై తమకు నమ్మకం పోయిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ హైడ్రా (HYDRAA) సిబ్బంది, పోలీసులు లేదా ఇతర అధికారులు ఎవరైనా తిరిగి ఆ భూముల్లోకి ప్రవేశిస్తే, వారిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది.

ఈ వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ (HYDRAA Ranganath) వ్యక్తిగతంగా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి కమిషనర్ తీరుపై తీవ్రంగా మందలిస్తూ, న్యాయస్థాన ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడంపై ఆగ్రహం వెళ్లగక్కారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన ఉందనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

గతంలో కూడా ఈ భూముల జోలికి వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, హైడ్రా వాహనాలు అక్కడ కనిపించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఒక దశలో కమిషనర్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించినప్పటికీ, అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. భవిష్యత్తులో గనుక అధికారులు మళ్లీ ఆ భూముల్లోకి వస్తే, వారి వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులకు సంకెళ్లు వేసి ఆర్మీ బ్యారెక్స్‌కు తరలించవచ్చని, ఆ విషయాన్ని వెంటనే కోర్టుకు తెలియజేయాలని మిలిటరీ బలగాలకు హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Read Also: కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>