కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సొంత పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక గన్నేరువరం మండల కాంగ్రెస్ (Congress) నాయకుడు బేతెల్లి రాజేందర్ రెడ్డి (Rajender Reddy) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 14న మానకొండూరు (Manakondur) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. రాజేందర్ రెడ్డి గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ రాజేందర్, పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు లభిస్తుందని ఆశించాడు. కానీ స్వపక్షంలోనే ఎదురైన వేధింపులు, ఆరోపణలు, అక్రమ కేసులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజేందర్ రెడ్డి మృతితో మానకొండూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రాజేందర్ తన ఆత్మహత్యాయత్నానికి ముందు, ఆసుపత్రిలో ఇచ్చిన మరణ వాంగ్మూలంలో తీవ్ర ఆరోపణలు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి తనపై దాడి చేయించాడని, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించి తీవ్రంగా బెదిరించాడని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. తనపై జరుగుతున్న అన్యాయం గురించి గోడు చెప్పుకునేందుకు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఆయన అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
రాజేందర్ రెడ్డి మృతికి మానకొండూరు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ప్రధాన కారణమని ఆయన భార్య సమత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అండదండలతోనే పీఏ ఆరాచకాలు సృష్టిస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని ఎమ్మెల్యే, పీఏ.. పట్టించుకోని అధిష్టానం
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత కూడా సొంత పార్టీ నాయకులు ఆయనను పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో లేనప్పుడు అన్నింట్లో ముందుండి పనిచేసిన రాజేందర్ రెడ్డి పట్ల చూపించిన వివక్ష సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తనపై జరుగుతున్న అన్యాయం గురించి గోడు చెప్పుకునేందుకు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఆయన అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి తనపై దాడి చేయించాడని, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించి తీవ్రంగా బెదిరించాడని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. మానకొండూరు నియోజకవర్గంలో అసలేం జరుగుతుందో తెలిసి కూడా అధిష్టానం స్పందించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాగా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ రాజేందర్ రెడ్డి కనీసం స్పందించలేదు. మరో వైపు పీఏ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రశ్నించడమే పాపమా?
అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ముందడుగు వేసి పోరాడిన నాయకుడు రాజేందర్ రెడ్డి. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయనకు వేధింపులే ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి తమ గ్రామానికి ఎంతో మంచి చేశాడని, ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు వేవని గ్రామస్తులు చెప్తున్నారు. కళ్ల ముందు జరుగుతున్న కొన్ని అక్రమాలను ప్రశ్నించినందుకే తన భర్తను వేధించారని, తన భర్త మృతికి మానకొండూరు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డియే కారణమని, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని రాజేందర్ రెడ్డి భార్య సమత సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతకే రక్షణ లేకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల హై అలర్ట్
కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి మరణంతో మానకొండూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (ప్రజాభవన్) వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుండ్లపల్లిలోని ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు ముందస్తు గస్తీ నిర్వహిస్తున్నారు.

