కలం, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ప్రధాని మోదీ (PM Modi) బయటకు వచ్చి మాట్లాడాలని, దేశ యువతకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేస్తూ మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఖాళీ మాటలు లేదా అరకొర ప్రకటనలతో కాలయాపన చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న యువతపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్‌తో ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందని, మన పిల్లలపైనే ఇష్టారాజ్యంగా అణచివేతకు పాల్పడ్డారని మండిపడ్డారు. వీధుల్లో రక్తం చిందించిన యువతీయువకుల కళ్లలోకి చూసి, ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని మోదీకి సవాల్ విసిరారు.
యువతకు సంబంధించి ఖర్గే మూడు స్పష్టమైన డిమాండ్లను ప్రధాని మోదీ ముందుంచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. యువతపై జరిగిన అకృత్యాలకు, దౌర్జన్యాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే వేధింపులకు గురైన వారికి తగిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యా వ్యవస్థ బందీ అయిందని, పీఎల్‌ఎఫ్‌ఎస్ డేటా ప్రకారం యువతలో నిరుద్యోగం 29 శాతానికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు లేక, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అరకొరగా మారి యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్ట్ విధానం పెరుగుతునన వేళ యువత తమ భవిష్యత్తు కోసం ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.

