వృద్ధ దంపతులపై కారం చల్లి బంగారు గొలుసు చోరీ!

కలం, ఖమ్మం బ్యూరో: వృద్ధ దంపతులే లక్ష్యంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం (Tirumalayapalem) మండలంలో జరిగిన దొంగతనం తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతుల కళ్లల్లో కారం చల్లి, వారి వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లిన దారుణ సంఘటన (Gold Chain Theft) బీరోలు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

​బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఆవుల శకుంతల (80), భద్రయ్య (85) దంపతులు బుధవారం రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. మంచంపై ఉన్న వృద్ధ దంపతుల ముఖాలపై ఒక్కసారిగా కారం చల్లి, శకుంతల మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లాడు. ​సమయానికి స్పందించిన భద్రయ్య దుండగుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అతడు బయట సిద్ధంగా ఉన్న ద్విచక్రవాహనంపై వేగంగా పరారయ్యాడు. దుండగుడు తలకు హెల్మెట్ ధరించి ఉండటంతో అతడిని గుర్తుపట్టలేకపోయామని, బైక్‌పై పారిపోవడంతో వెంటాడినా దొరకలేదని బాధితుడు భద్రయ్య వాపోయారు.

​ఈ పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన దంపతుల కేకలు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో అర్ధరాత్రి వేళ ఇలాంటి దారుణం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>