కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత ఆధునీకరించేందుకు, భూ రికార్డులకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచడం, భూ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’ (Mee Bhoomi Blockchain) విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ అత్యంత సురక్షితమైన ‘టాంపర్-ప్రూఫ్’ (ట్యాంపరింగ్‌కు వీలులేని) వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో 7 జిల్లాల పరిధిలోని 89 పునర్-సర్వే పూర్తయిన గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ సరికొత్త సాంకేతికత ద్వారా ప్రతి భూభాగానికి (లాండ్ పార్సెల్) ప్రత్యేకమైన బ్లాక్‌చెయిన్ గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల ఏ అధికారి, ఏ సమయంలో, ఎలాంటి మార్పులు చేశారనే వివరాలు శాశ్వతంగా రికార్డుల్లో నిలిచిపోతాయి. ప్రభుత్వ అనుమతి పొందిన ఆన్లైన్ సేవల ద్వారా మాత్రమే భూ రికార్డుల సవరణ సాధ్యమవుతుంది కాబట్టి, ఇకపై రికార్డుల మాయాజాలానికి తావుండదు. భూ సేవలలో సంపూర్ణ పారదర్శకత తీసుకువచ్చి, ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

