కలం, ఖమ్మం బ్యూరో: ఏకంగా ఏడున్నర అడుగుల పొడవుతో పెరిగిన భారీ పొట్లకాయ (Bottle Gourd) స్థానికులతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)ను విశేషంగా ఆకట్టుకుంది. సత్తుపల్లికి చెందిన రైతు పిన్నమనేని రాధాకృష్ణ తమ తోటలో సాగు చేసిన ఈ అరుదైన పొట్లకాయను బుధవారం సీనియర్ నాయకుడు చల్లగుల్ల నరసింహారావు నివాసం వద్ద ఉంచగా, మంత్రి తుమ్మల ఆసక్తిగా తిలకించి మురిసిపోయారు. పొట్లకాయ అంత సుదీర్ఘంగా పండిన విధానాన్ని, దానికి ఉపయోగించిన విత్తనాలు, అనుసరించిన వినూత్న సాగు పద్ధతుల గురించి రైతు రాధాకృష్ణను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కష్టపడి అరుదైన దిగుబడి సాధించిన రైతును ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

