కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం గౌరయిపల్లి గ్రామంలో పట్టణ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ట్రాఫిక్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను ఎల్లప్పుడూ పాటించాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ కచ్చితంగా ధరించాల్సిందేనని, లేని యెడల కారులో ప్రయాణించే అందరికి ప్రమాదమేనని చెప్పుకొచ్చారు.
అతివేగంగా వాహనం నడపడం ప్రాణాలతో చెలగాటాలు ఆడటమే అని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపటం నేరమని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని.. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను తప్పనిసరిగా పాటించాలని.. పాటించని యెడల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం నడిపే ముందు బ్రేకులు, లైట్లు ఇతర భద్రతా పరికరాలను పరిశీలించడం భాద్యతగా బావించాలని సూచించారు.
రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత కాదని సీఐ భాస్కర్ వ్యాఖ్యానించారు. ప్రతి వాహనదారుడు, పౌరుడు బాధ్యతతో వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చునని.. మన జాగ్రత్తతో మన ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగల్గుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సైదులు, ఇంద్రా రెడ్డి, పోలీస్ సిబ్బందితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

