కలం, కరీంనగర్: ఢిల్లీలో యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని ఏఐవైఎఫ్(AIYF) నాయకులు పోలోజు రంజిత్, బ్రాహ్మణపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. నీట్-యూజీ, యూజీసీ-నెట్ వంటి కీలక పరీక్షలలో ప్రశ్నపత్రాల లీకేజీలు, మూల్యాంకన వివాదాలు, ఇతర అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రంజిత్, యుగంధర్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కారణంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసమర్థ సంస్థగా మారిందని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలలో వరుసగా అక్రమాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమకు విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం అప్రజాస్వామిక చర్యలని ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తుతున్న విద్యార్థులను అణచివేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే యువత, విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని రంజిత్, యుగంధర్ హెచ్చరించారు.
Read Also: కామన్వెల్త్ గేమ్స్ 2026: భారత పతకాల ఆశలపై దెబ్బ?
Follow Us On : WhatsApp

