కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎల్ నినో (El Nino Telangana) ఎఫెక్ట్ వ్యవసాయ రంగంపైనే కాకుండా విద్యుత్ వ్యవస్థపైనా భారీగా పడనున్నది. సాధారణంగా వర్షాకాలంలో పండే పంటకు సాగునీటి ఇబ్బందులు తక్కువే. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, కాల్వల్లో అందుబాటులో ఉండడంతో వ్యవసాయ పంపుసెట్ల వాడకం తక్కువగానే ఉంటుంది. దీంతో యాసంగితో పోలిస్తే వర్షాకాలం సీజన్‌లో విద్యుత్ వినియోగం కాస్త తక్కువ. కానీ, ఈసారి ఎల్ నినో ప్రభావంతో అటు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరడం, కాల్వల్లో నీరు లేకపోవడం, అవసరానికి తగినంత సాగునీరు అందకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ సంతృప్తికరంగా ఉన్న దగ్గర పంపుసెట్ల వాడకం పెరిగింది.
దీనికి తగినట్లుగానే విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఒకవైపు రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు బొగ్గు నిల్వల సమస్యతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గుతున్నది. వ్యవసాయ అవసరాలకు నిరంతరం విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కావడంతో పవర్ ఎక్స్చేంజ్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్ కొనాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రత్యక్షంగా డిస్కంలపైనా, పరోక్షంగా ఖజానాపైనా ఆర్థిక భారం పడుతున్నది.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర సర్కార్‌కు ఎల్ నినో కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అవసరాలకు తగినంత ఆర్థిక వనరులు లేకపోవడంతో పలు సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటు సవాల్గా మారింది. దీనికి తోడు ఉద్యోగుల నుంచి పెండింగ్ డీఏలు, పీఆర్సీ చెల్లింపుల డిమాండ్లు. ఇంకోవైపు ప్రతి నెలా సర్దుబాటు చేయాల్సిన అద్దె వాహనాల బిల్లుల పెండింగ్. ఇప్పుడు ఎల్ నినో రూపంలో అటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం ఇటు విద్యుత్ కొనుగోలు కోసం అదనంగా నిధులను సమకూర్చుకోవడం గోటి చుట్టూ రోకటి పోటులా తయారైంది.
ఇప్పటికే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయడంలేదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోవడంతో వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటిని మాత్రమే సరఫరా చేస్తామని, సాగునీటి విడుదల ఉండదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బోరు బావుల ద్వారానే సాగు చేసుకోవాలనుకున్న రైతులు పంపుసెట్లపై ఆధారపడుతున్నారు.
వేసవి మాదిరి కరెంట్ వాడకం
– సాధారణంగా వేసవి కాలంలో నమోదు కావాల్సిన గరిష్ట విద్యుత్ వినియోగం ఈ సంవత్సరం జులై నెలలోనూ కంటిన్యూ అవుతున్నది. వాతావరణ మార్పులతో ఇండ్లలో, ఆఫీసుల్లో, దుకాణాల్లో జులై నెలలోనూ ఏసీలు వాడుకోవాల్సి వస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగానే కరెంటు వాడకం పెరిగింది. ఏటేటా రాష్ట్రంలో సగటు విద్యుత్ డిమాండ్ పెరుగుతూనే ఉన్నది.
– ఉదాహరణకు గతేడాది మార్చి నెలలో 17,162 మెగావాట్ల డిమాండ్ వస్తే.. ఈసారి అది 18,228 మెగావాట్లకు (1,066 పెరిగింది) చేరుకుంది. ఏప్రిల్ నెలలో 16,850 నుంచి 17,005 మెగావాట్లకు (155 మె.వా. పెరిగింది) చేరుకుంది. మే నెలలలో మాత్రం అకాల వర్షాలు, ఈదురుగాలులు, రబీ పంట కోతలు పూర్తికావడంతో వినియోగం గతేడాదిలో 13,920 ఉంటే ఈసారి అది 12,717 మెగావాట్లకు తగ్గింది. జూన్ నెలలో మాత్రం 11,480 మెగావాట్ల నుంచి 12,150 మెగావాట్లకు పెరిగింది. జులైలో (ఇప్పటి వరకు) గతేడాది 10,250 మెగావాట్లు ఉండగా ఈసారి అది 11,850 మెగావాట్లకు పెరిగింది. ఇకపైన వర్షాలు కురిస్తే విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితి కొనసాగితే మాత్రం భారీగా పెరుగుతుంది.
స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో గ్రిడ్ నిర్వహణ
గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఏర్పడితే, ఒకేసారి వ్యవసాయ పంపుసెట్లన్నీ ఆన్చేస్తే పీక్ లోడ్ మేనేజ్‌మెంట్ ఇంజినీర్లకు సవాల్గా మారుతుంది. సరిగ్గా ఇదే ఆందోళనతో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు తరచూ రివ్యూ చేస్తూ నిరంతర విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలోని ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. దక్షిణ డిస్కం సీఎండీ సోమవారం నిర్వహించిన సమీక్షలో విద్యుత్ సరఫరాలో వ్యవసాయ పంపుసెట్ల వినియోగం సవాల్గా మారనుందని పేర్కొన్నారు.
ఇంధన శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం విద్యుత్ సరఫరా, నియంత్రణ గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసి కొన్ని సూచనలు చేశారు. ట్రాన్స్ కో, డిస్కంలు ముందుగానే స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ మెకానిజాన్ని సిద్ధం చేసుకున్నాయని తెలిపారు. పగటి సమయాల్లో సోలార్ ఎనర్జీని వినియోగాన్ని పెంచి టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటున్నదని వివరించారు.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో సీజన్‌లవారీగా గడిచిన రెండేండ్లలో విద్యుత్ వినియోగం ఇలా…
2023-24 :
దక్షిణ డిస్కం
ఖరీఫ్ : 5,650 మిలియన్ యూనిట్స్
రబీ : 7,420 మి.యూ
మొత్తం : 13,070 మి.యూ
ఉత్తర డిస్కం
ఖరీఫ్ : 4,180 మి.యూ
రబీ : 5,920 మి.యూ.
మొత్తం 10,100 మి.యూ
2024-25 :
దక్షిణ డిస్కం
ఖరీఫ్ : 5,920 మి.యూ
రబీ : 7,850 మి.యూ
మొత్తం : 13,770 మి.యూ
ఉత్తర డిస్కం
ఖరీఫ్ : 4,350 మి.యూ
రబీ : 6,280 మి.యూ.
మొత్తం 10,630 మి.యూ.
వ్యవసాయానికి కరెంట్ వినియోగం (ఖరీఫ్, రబీ కలిపి) :
2023-24లో : 23,170 మి.యూ.
2024-25లో : 24,400 మి.యూ.
పెరిగిన వ్యవసాయ కనెక్షన్లు:
ఉత్తర డిస్కం పరిధిలో 2023-24లో 13.18 లక్షల పంపుసెట్ కనెక్షన్లు ఉంటే 2024-25లో అది 13,57 లక్షలకు పెరిగింది.
దక్షిణ డిస్కం పరిధిలో 2023-24లో 14.80 లక్షల పంపుసెట కనెక్షన్లు ఉంటే 2024-25లో 15.20 లక్షలకు పెరిగింది.

