కలం, స్పోర్ట్స్ : భారత్ స్ప్రింటర్ విశాల్ టీకే (Vishal TK) ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌పై ఫోకస్ పెట్టాడు. గ్లాస్గోలో జరగనున్న తన తొలి కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 22 ఏళ్ల విశాల్ ఈ ఏడాది చరిత్ర సృష్టించాడు. 400 మీటర్ల పరుగును 45 సెకన్లలోపు పూర్తి చేసిన తొలి భారత పురుష అథ్లెట్‌గా నిలిచాడు. 44.98 సెకన్లతో కొత్త జాతీయ రికార్డు నమోదు చేశాడు. నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన విశాల్.. ఇప్పుడు ఆసియాలోనే టాప్ క్వార్టర్ మైలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ అతడు మెరిశాడు. మిక్స్డ్ 4×400 రిలేలో స్వర్ణం గెలిచాడు. పురుషుల 4×400 రిలేలో రజత పతకం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-60లో ఉన్న విశాల్.. భారత్‌కు ప్రధాన ఆశగా మారాడు. కామన్వెల్త్ గేమ్స్‌కు విజేతగా వెళ్లాలనే ఆలోచనతోనే సిద్ధమవుతున్నానని విశాల్ తెలిపాడు. కష్టపడి చేసిన సాధన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమే తన బలమని చెప్పాడు. కోచ్ జేసన్ డాసన్పై పూర్తి నమ్మకం ఉందని వివరించాడు.
భారత్ తరఫున ఆడటమే తనకు అతిపెద్ద ప్రేరణ అని పేర్కొన్నాడు. ప్రతి పోటీలో తన హద్దులను దాటేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తన విజయాల వెనుక మొత్తం జట్టే కారణమని విశాల్ చెప్పాడు. ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ నుంచి కోచింగ్, పోషకాహారం, రికవరీ, స్పోర్ట్స్ సైన్స్ పరంగా పూర్తి సహకారం లభిస్తోందని వివరించాడు. ఇటీవలి కాలంలో భారత 400 మీటర్ల పరుగులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని విశాల్ అభిప్రాయపడ్డాడు. ఆ మార్పులో తాను భాగస్వామి కావడం గర్వంగా ఉందని చెప్పాడు.
ఇటీవలి నెలల్లో తన సాధనలో నిలకడకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించాడు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా మరింత బలపడేందుకు కృషి చేశానని తెలిపాడు. భారత్ జెర్సీ ధరించడం తనకు గొప్ప గౌరవమని విశాల్ పేర్కొన్నాడు. ట్రాక్‌పై అడుగుపెట్టే ప్రతిసారీ కోట్లాది భారతీయుల ఆశలను గుర్తుంచుకుని పోటీపడతానని వివరించాడు.

