కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరంలోని 40 డివిజన్‌లలో చేపట్టిన ఓటరు జాబితా ప్రక్షాళన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బీజేపీ (BJP) ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సీనియర్ నాయకుడు గుజ్జ శ్రీనివాస్‌తో పాటు వివిధ డివిజన్‌ల కార్పొరేటర్లు, ఇన్‌చార్జులు, జోన్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ బాధ్యులు, బీఎల్‌ఏ-2లు, శక్తి కేంద్ర ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరంలోని అన్ని డివిజన్లలో ఓటరు జాబితాలో కొత్త ఓట్ల నమోదు, డూప్లికేట్ ఓట్లు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలనను నాయకులు సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్క యువతీ యువకుడికి ఓటు హక్కు కల్పించేలా బూత్ స్థాయి కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు నమోదు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, నగరంలోని 40 డివిజన్‌లలో పార్టీ కార్యకర్తలు చేపడుతున్న ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం సంతృప్తికరంగా కొనసాగుతోందని నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ బాధ్యులు, కార్పొరేటర్లు, జోన్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు తమ తమ ప్రాంతాలలో ఓటరు జాబితా పరిస్థితిని పార్టీ నాయకత్వానికి వివరించారు.

