కలం, పెద్దపల్లి : ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) సూచించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచిస్తున్న ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటల ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలను ప్రతి రైతు పాటించాలని, అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ప్రభుత్వ సహకారం అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరం ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన కట్ట అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. తదుపరి గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 34 మంది లబ్ధిదారులకు రూ.34 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను, 73 మందికి రూ.24,08,500 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

