కలం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta) ఆలయంలో భక్తులకు ‘నిత్యాన్నదానం’ ద్వారా అద్భుతమైన అన్నప్రసాదాలు భక్తులకు విశాలమైన ప్రసాద భవనంలో పులిహోర, పప్పుచారు, పన్నీరు కూర్మ, ఆలూ కర్రీ, పెరుగు, లడ్డూ వంటి రుచికరమైన మధురమైన వంటకాలను ‘రాజాభోగం’లా వడ్డిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోజువారీగా వచ్చే వేలాది మంది భక్తులకు అనుగుణంగా నిత్యాన్నదానం ఈ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి.
ఈ మేరకు దివ్యక్షేత్రంలో వైటీడీఏ, దేవస్థాన అధికారులు భక్తులకు అధునాతన మౌలిక వసతుల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండకింద సకల సౌకర్యాలతో నిత్యాన్నదాన సత్ర భవనాన్ని ప్రారంభించారు. వైటీడీఏ ఆధ్యర్యంలో రూ.8 కోట్లు, దాత వేగేష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.14 కోట్లు కలిపి మొత్తం రూ.22 కోట్లతో ఆర్టీసీ బస్ స్టాండు ప్రక్కన సుమారుగా మూడు ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు.
ఈ నిత్యాన్నదానం లో ఒక్కో హాల్లో ఒకేసారి 664 మంది భక్తులకు రాజాభోగ భోజనం చేసేలా రెండు హాళ్లను నిర్మించారు సువిశాలమైన వంటగది,రోజువారీగా తాజా కూరగాయలు భద్రపరిచే రూములు, ప్రత్యేక గదిలో ఫ్రిజ్‌ల ఏర్పాటు, వీవీఐపీల భోజనం కోసం 20 మంది కూర్చునే విధంగా వీఐపీ గదిని ఏర్పాటు చేశారు. ఎంత మంది భక్తులు వచ్చినా వారికి సరిపోయేలా యాదాద్రి దేవస్థానం అధికారులు ఉచిత నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు.

