కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ అంశంపై ప్రధాని మోదీ ఎన్నాళ్లని మౌనంగా ఉంటూ తప్పించుకుంటారని, ఈసారి ఆయన కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిపై జరుగుతున్న దాడి ఆ కుటుంబంపై జరుగుతున్న దాడితో సమానమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల గొంతును నొక్కేయడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానిస్తూ, యువతకు మద్దతుగా ప్రధాని నివాసం వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా ధర్నా స్థలానికి చేరుకుని రాహుల్ గాంధీతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఇక రాహుల్ గాంధీతో జరిపిన చర్చల అనంతరం, జితేంద్ర సింగ్ వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రతిపక్షం లేవనెత్తిన ఆరు కీలక డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆరు కీలక డిమాండ్లు ఇవే..!
రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముందు ఉంచిన డిమాండ్ల విషయానికొస్తే .. నీట్ పరీక్ష విఫలత్వానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. పార్లమెంట్ లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి. అంతేకాదు నీట్ పేపర్ లీక్ వివాదం, బాధ్యులపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో పూర్తి స్థాయి సమాధానం ఇవ్వాలి. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు, పోలీసుల చర్యలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలి. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఈ అంశంపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. పేపర్ లీక్ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా వ్యవస్థ రక్షణ కోసం ఈ పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

