గోదావరి జలాలు అందించడమే నా జీవిత లక్ష్యం: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: వ్యవసాయ రంగంలో ఆయిల్ పామ్ సాగు రైతుల పాలిట వరంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. పదేళ్లపాటు నిశ్చింతగా ఉంటూ దాదాపు 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఈ పంట రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది అని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలో ప్రస్తుతం 8 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని చెప్పారు. రైతులు ముందుకు వచ్చి మరో 10 వేల ఎకరాల్లో సాగు విస్తరిస్తే వెంటనే ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని రైతులకు పిలుపునిచ్చారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెరిగితేనే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తోందన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే 35 శాతం లోటు వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. రాబోయే నెలల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున బోర్లపై ఆధారపడి వరి వేయవద్దని కోరారు. తక్కువ నీటితో పండే పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ అపరాల సాగును చేపట్టాలని సూచించారు. పత్తిలో కందిని, ఆయిల్ పామ్‌లో మునగను అంతర పంటలుగా వేస్తే నేల సారం పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.

​ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతు తన పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయిన వెంటనే చెరువులను నింపుతామని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు.

​జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 90 వేల ఎకరాల్లో సాగు ఉండగా, ఈ ఏడాది కొత్తగా మరో 15 వేల ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆత్మనిర్భర్ మిషన్ అపరాల కింద 50 శాతం రాయితీపై అందిస్తున్న కంది, మినుము విత్తనాలను మంత్రి, కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>