కలం, నిర్మల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సూచించారు. మంగళవారం సోన్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వంపై ప్రజలలో విశ్వాసాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని సూచించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించారు. పలు అంశాలపై ఆయన అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)ని బీజేపీ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంచు సవీన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యం.. మౌలిక వసతులపై ఎమ్మెల్యే ఏలేటి హామీ
Follow Us On: X(Twitter)

