కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో కారణంగా ఒక్క వ్యవసాయమే కాకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పులతో తెలంగాణ ప్రభావానికి గురవుతోందన్నారు. ‘ఎల్ నినో కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని తగ్గించడమెలా?’ అనే అంశంపై రవీంద్ర భారతిలో జరిగిన నిపుణుల సమావేశంలో భట్టి మాట్లాడారు.
విద్యుత్తు కొరత పెరిగే అవకాశం..
హైడల్ పవర్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడంతో విద్యుత్తు కొరత ఇంకా పెరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఉదయం పూట వేడి ఎక్కువగా ఉండటంతో వేసవిలో మాదిరి ప్రజలు ఏసీలు, కూలర్లు వేసవిలో మాదిరి వాడుతున్నారని వివరించారు.
సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉంటుందని.. కానీ ఎల్ నినో కారణంగా రోజురోజుకు పెరుగుతూనే ఉందన్నారు. సోలార్ పవర్ అందుబాటులో ఉందని.. రైతులు ఉదయం పూట దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. తద్వారా, ప్రజలపై విద్యుత్తు కొనుగోళ్ల భారం కొంత తగ్గించుకోవచ్చని భట్టి విక్రమార్క సూచించారు.

