రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు.. అధికారులు ఆదేశాలు బేఖాతరు

కలం, నిర్మల్: ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణ పనుల్లో నాసిరకం ఇసుకను వినియోగిస్తూ, సిమెంట్ మోతాదును కూడా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉపయోగించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో నిర్మాణం పూర్తికాకముందే రోడ్డు బలంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ రోడ్డు దెబ్బతింటే ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని భక్తులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులు కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అడెల్లిలో జరుగుతున్న పనులను చూస్తే ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?

నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరిశీలించాల్సి ఉన్నా, ఇక్కడ అలాంటి పర్యవేక్షణ కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఉంటే నాసిరకం సామగ్రి వినియోగానికి అవకాశం ఉండేదే కాదని అంటున్నారు. ఈ నిర్మాణ పనులపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత కాంట్రాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>