యాదగిరిగుట్టలో వరుణ యాగం ప్రారంభం

కలం, యాదగిరిగుట్ట: ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుంచి ఉపశమనం లభించి, రాష్ట్రం సస్యశ్యామలం కావాలని కాంక్షిస్తూ యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక యాగం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయమైన శివాలయం (పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం) వేదికగా ‘వర్ష పాశుపత వరుణ యాగం’ శాస్త్రోక్తంగా మొదలైంది.

ప్రస్తుతం దేశం, రాష్ట్రంలోనూ తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని జనజీవనం అతలాకుతలం అయ్యే దుస్ధితి ఏర్పడుతోంది. దీని నుంచి తక్షణ రక్షణ లభించాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సత్సంకల్పంతో ఈ యాగం చేపట్టారు.

మంత్రి ఆదేశాలతో..

మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవస్థానం ఈ యాగాన్ని ప్రారంభించింది. మొదటి రోజు సాయంకాలం సమయంలో ఆలయ వేద పండితులు, అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రథమ పూజలను నిర్వహించారు.

లోకకల్యాణార్థం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, పంచగవ్యప్రాసనము వంటి విశేష వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కరువు కష్టాలు తీరి, త్వరలోనే మంచి వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన అర్చకులు, పూజారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>