కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో(Karimnagar) విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు(Sunil Rao)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా యాదగిరి సునీల్ రావు అకాడమీ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి చెస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ ఆట మానసిక వికాసానికి, ఏకాగ్రత పెంపునకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మేధోపరమైన క్రీడల్లోనూ పాల్గొని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. చిన్నారుల్లో ఆలోచనా శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచడంలో చెస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, విశ్వనాథ్ చెస్ అకాడమీ నిర్వాహకులు, కోచ్లు, క్రీడాకారులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

