కలం, కరీంనగర్ బ్యూరో: వరద కాలువ నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మల్యాల మండలంలో రైతులు చేపట్టిన నిరసనకు.. మద్దతు తెలిపేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను (Sunke Ravi Shankar) పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల సమస్యలపై ఆందోళనకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో రైతులకు మద్దతుగా వెళ్లిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న సుంకె రవిశంకర్.. బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జేఎన్టీయూ సమీపంలోని దొంగలమర్రి వద్ద రాస్తారోకో నిర్వహించారు. జీవన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసులు నిరసనను అడ్డుకుని సుంకె రవిశంకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్న నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను పరిష్కరించలేరని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వరద కాలువ నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

